news logo

రాజకీయాలు

పెట్రోలూ డీజిలు కు బదులుగా ....గాలీ నీరే... ఇంధనం!

December 18, 2019 4:13pm

నీటితో దీపం పెడతారు’ అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో. నిప్పును ఆర్పే నీరు దీపాన్ని ఎలా వెలగనిస్తుందీ... అనే అనుకున్నాం ఇన్నాళ్లూ. ఆయన చెప్పారని కాదు కానీ, శాస్త్రవేత్తలు తమ మానాన తాము పరిశోధనలు చేసి దాన్ని నిజం చేయడమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. లైట్లు వెలిగించడానికే కాదు, వాహనాలను నడిపించడానికి కూడా నీరూ గాలీనే ఇప్పుడు మనకు ప్రధాన ఇంధన వనరులు కానున్నాయి. పెట్రోలో డీజిలో పోయించుకున్నట్లుగా కారులో కాసింత గాలి కొట్టించుకుని రయ్యిన దూసుకుపోయే రోజులొచ్చేశాయి మరి! కారో బైకో చేతిలో ఉంటే ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లిపోతాం. సొంత వాహనం లేకపోతే అద్దె వాహనం. దూరప్రయాణాలకు బస్సూ రైలూ ఉండనే ఉన్నాయి. ఇంకా త్వరగా వెళ్లాలంటే విమానంలో రివ్వున ఎగిరిపోవచ్చు. క్రూయిజ్ ఎక్కి సముద్రంలో దేశదేశాలూ చుట్టిరావచ్చు. ఈ వాహనాలేవీ లేనప్పటి పరిస్థితి మన ఊహకు కూడా అందదు ఇప్పుడు. కాబట్టి భవిష్యత్తులోనూ అవి లేకపోతే ఎలా అన్న ప్రశ్నే రాదు మనకు. కానీ, కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా ఇలా తిరగడం ఎక్కువయ్యే కొద్దీ ఇంధనం కోసం డిమాండూ పెరుగుతోంది. దాంతో ఎక్కడెక్కడ చమురు దొరుకుతుందోనని సముద్రం లోతుల్లో వెతికి వెతికి మరీ వెలికి తీస్తున్నారు. అందుకు బోలెడు డబ్బు ఖర్చవుతోంది. దాంతో పెట్రోలూ డీజిలూ వంటగ్యాసూ... అన్నిటి ధరలూ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉన్నాయి. మనకేమో తెల్లారిలేస్తే చదువులకీ ఉద్యోగాలకీ వ్యాపారాలకీ బయట తిరక్క తప్పదు. కాబట్టి వాహనాలూ అవసరమే వాటికి ఇంధనమూ అవసరమే. అందుకే పెట్రోలు బదులు నీళ్లతో నడిచే కారు కనిపెడితే బాగుంటుంది కదా అని మధ్య తరగతి కుటుంబరావులు నిట్టూరుస్తుంటారు. ఖర్చు సంగతి అలా ఉంచితే ఇక్కడ మరో విషయమూ ఆలోచించాలి. ఈ వాహనాలు మనకి ఎంతగా ఉపయోగపడుతున్నాయో అంతకన్నా ఎక్కువగా పర్యావరణాన్నీ ప్రభావితం చేశాయి, చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యానికీ భూతాపానికీ కారణమవుతున్న కర్బన ఉద్గారాల్లో పెద్ద వాటా వాహన కాలుష్యానిదే. పెట్రోలు, డీజిల్, సహజవాయువు... వీటన్నిటినీ శిలాజ ఇంధనాలంటారు. వీటిని వెలికితీసేటప్పుడే పరిసరాలన్నీ కలుషితమై పర్యావరణానికి హాని చేస్తున్నాయి. ఇక వెలికితీసి, శుద్ధిచేసి, వివిధ ఉత్పత్తులుగా మార్చుకునే క్రమంలో మరెంతో ఇంధనం ఖర్చవుతుంది. తయారైన ఇంధనాన్ని రవాణా చేయడం మరో పెద్ద ప్రహసనం. ఇవన్నీ పూర్తయి మన వాహనంలో చేరాక ఆ పెట్రోలూ డీజిళ్లను మండిస్తూ మనం చేసే ప్రయాణాల వల్ల వెలువడే మసి ఇప్పుడు మొత్తం ప్రపంచానికి పెనుసవాలుగా మారింది. నడిచే వాహనం వెనకాల పైపులోనుంచి వచ్చే పొగా కార్బన్ మోనాక్సైడ్ తదితర విషవాయువులూ గాలిలో కలిసి అక్కడినుంచి నేరుగా పీల్చే గాలి ద్వారా మనిషి ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నాయి. మరో పక్క భూతాపాన్ని పెంచి వాతావరణ మార్పులకీ కారణమవుతున్నాయి. అందుకే పర్యావరణ ఉద్యమకారులు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించమని ఆందోళన చేస్తున్నారు. కానీ, ఎలా తగ్గించగలం? తగ్గించాలంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వెతుక్కోవాలి. విద్యుత్తూ సౌరశక్తీ కొంతవరకూ ఆ అవసరాన్ని తీరుస్తున్నాయి. విద్యుత్తు వాహనాల తయారీ, వాడకమూ ఇప్పుడిప్పుడే అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరింకేం... వాటినే పెంచొచ్చు కదా? పెంచవచ్చు, కాకపోతే వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. రైళ్లని విద్యుదీకరణ చేయొచ్చు కానీ విమానాలను చేయలేం. కార్లూ బస్సులూ లాంటి వాటిని విద్యుత్ వాహనాలుగా మార్చవచ్చు కానీ దూరప్రాంతాలకు సరకు రవాణా చేసే ట్రక్కులకు బ్యాటరీలు వాడడం సాధ్యం కాదు. అలాగే సముద్రంలో తిరిగే ఓడలకు కూడా. ఈ మూడు రకాల వాహనాలకూ చాలా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయం ఇప్పటి అవసరం. ఆ దిశగా చేసే ప్రయత్నాల ఫలితమే హైడ్రోజన్ని తెరమీదికి తెచ్చింది. హైడ్రోజన్ అంటే... గాలి ఇంధనంగానా? అవును... హైడ్రోజన్‌నే ఇంధనంగా వాడుతున్నారు. దానికి ఆ శక్తి ఉందని రెండువందల ఏళ్ల క్రితమే కనిపెట్టారు. మనిషి చందమామ దగ్గరకి వెళ్లివచ్చాడంటే అది హైడ్రోజన్‌తోనే సాధ్యమైంది. రెండు హైడ్రోజన్ అణువులూ ఒక ఆక్సిజన్ అణువూ కలిస్తే నీరు అవుతుందని మనకు తెలుసు. దాన్ని విడదీస్తే హైడ్రోజన్ లభిస్తుంది. నీటిలోనూ, బయట వాతావరణంలోనూ బోలెడంత హైడ్రోజన్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవటం మీద దృష్టిపెట్టారు శాస్త్రవేత్తలు. మరి ఇన్నాళ్లుగా దాన్నే వాడకుండా పెట్రోలు ఎందుకు వాడుతున్నట్లు? పెట్రోలు లాగా హైడ్రోజన్ని వాడటం సాధ్యం కాలేదు కనకనే ఇన్నాళ్లూ దాని గురించి పట్టించుకోలేదు. ద్రవరూపంలో ఉండే పెట్రోలును నిల్వ చేయడం తేలిక. గాలి రూపంలో ఉండే హైడ్రోజన్ని పట్టుకోవటమూ వాహనంలో ఉండే కొద్ది స్థలంలో బంధించడమూ అంత తేలిక కాదు. అదెలా చేయాలన్న విషయంలో మూడు నాలుగు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చాలా తేలిగ్గా ఉండే ఈ వాయువు వాతావరణంలో ఒంటరిగా కాక ఇతర మూలకాలతో కలిసి ఉంటుంది. వాటినుంచి విడదీసి, మన వాడకానికి పనికొచ్చేలా దాన్ని మార్చుకోవటానికి చాలా ఖర్చవుతుంది. దానికి తోడు వాహనాల ఇంజిన్లనూ అందుకు అనువుగా తయారుచేయాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇన్నాళ్లూ దాని జోలికి పోలేదు. నిజానికి పదేళ్ల క్రితం కూడా హైడ్రోజన్ అంత వెసులుబాటు కాదనే అనుకున్నారు. తీవ్రంగా మండే స్వభావం ఉండడం వల్ల దాన్ని నిల్వ చేయడం కష్టమనీ, తయారుచేయడం ఖరీదైన వ్యవహారమనీ, దేశవ్యాప్తంగా సరఫరా కేంద్రాలు పెట్టడం తలకు మించిన భారమనీ, హైడ్రోజన్ ఫ్యూయల్సెల్స్ ఖరీదెక్కువనీ... చెప్పి అమెరికా ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది. కానీ భూతాపం కత్తి మెడమీద వేలాడుతుండడంతో కర్బన ఉద్గారాల్ని తగ్గించుకోవాలంటే హైడ్రోజన్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని కంపెనీలే చొరవ తీసుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. కొత్త వాహనాలను రోడ్లపైకి తెస్తున్నాయి. ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో? ఇప్పటికే చాలా దేశాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అమెరికా, జపాన్, చైనా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణకొరియాలాంటి దేశాల్లో వేల సంఖ్యలో కార్లూ, బస్సులూ, సరుకు రవాణా ట్రక్కులూ హైడ్రోజన్‌తో నడుస్తున్నాయి. టొయోటా, హ్యుందయ్, హోండా లాంటి కంపెనీలు ఈ వాహనాలను అమ్ముతున్నాయి. విద్యుత్ వాహనాలకు తోడుగా హైడ్రోజన్ వాహనాలను తేవడం ద్వారా మెల్లమెల్లగా వాటి సంఖ్య పెంచుకుంటూ పోవచ్చన్నది వీరి ఆలోచన. కార్ల కన్నా కూడా బస్సులూ ట్రక్కుల తయారీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. చైనా ట్రాముల్ని తయారుచేస్తే జర్మనీ రైలును కూడా హైడ్రోజన్‌తో నడిపిచూసింది. మన దేశంలోనూ హైడ్రోజన్‌తో నడిచే వాహనాలను ప్రయోగాత్మకంగా వాడడం మొదలెట్టారు. ఏడేళ్ల క్రితమే దిల్లీలో హైడ్రోజన్‌తో నడిచే 15 ఆటో రిక్షాలను ప్రారంభించారు. ఐఐటీ దిల్లీకి చెందిన శాస్త్రవేత్తలు ఆటోల ఇంజిన్లను మార్చి హైడ్రోజన్ గ్యాస్ ట్యాంక్ అమర్చి వాటిని పనిచేయించారు. గ్యాస్‌తో నడిచే ఆటో రిక్షాల్లాగే వీటినీ రీఫిల్ చేస్తుంటారు. 2020 నాటికి కనీసం పది లక్షల హైడ్రోజన్ వాహనాలైనా రోడ్ల మీద తిరిగేలా చూడాలని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ ఆనాడు లక్ష్యంగా పెట్టుకుంది కానీ అంత వేగంగా పని జరగలేదు. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దిల్లీలో 50 బస్సుల్ని ప్రయోగాత్మకంగా నడపడం ప్రారంభించారు. అంటే ఈ వాహనాల్లో హైడ్రోజన్ సిలిండర్ ఉంటుందా? అవును. సీఎన్జీ సిలిండర్ లాగే కంప్రెస్డ్ హైడ్రోజన్ సిలిండర్ ఉంటుంది. దాంతో పాటు బ్యాటరీల్లాంటి ఫ్యూయల్ సెల్స్ ఉంటాయి. ఇవి హైడ్రోజన్ సిలిండర్లోని గాలిని తీసుకుని దాని రసాయనశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చి వాహనంలోని మోటర్ని నడిపిస్తాయి. కంప్రెస్డ్ గాలిని ఇంధనంగా మార్చే పని ఈ ఫ్యూయల్ సెల్స్ ధీ. బ్యాటరీ కన్నా ఇవి ఏ విధంగా మేలు? లీథియం అయాన్ బ్యాటరీలు ఇతర దేశాల్లో పనిచేసినంత బాగా మనలాంటి ఉష్ణదేశంలో పనిచేయవు. రెండోది వాటికి కావలసిన ముడిసరకుల్నీ తయారుచేసే విధానాన్నీ కూడా దిగుమతి చేసుకోవాల్సిందే. ఇంకా ముఖ్యమైన అంశం వాటిని ఛార్జ్ చేయడానికి సౌర, పవన విద్యుత్తు వాడితే పర్వాలేదు కానీ చాలావరకూ బొగ్గుతో తయారైన విద్యుత్తే అందుబాటులో ఉంటోంది. అంటే మరో రకంగా కాలుష్యం కొనసాగుతూనే ఉంటుంది. హైడ్రోజన్‌తో ఆ గొడవ లేదు. ఇది ప్రకృతిలో పుష్కలంగా దొరుకుతుంది. మనదేశంలో హైడ్రోజన్ ఇంధనానికి ప్రాధాన్యమిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నీటిఆవిరిని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులుగా విడదీయడంద్వారా హైడ్రోజన్ని తయారుచేయాలనుకుంటోంది. ఆ ప్రక్రియకు సౌరవిద్యుత్తును కానీ బయోగ్యాస్‌ని కానీ ఉపయోగించి పూర్తిగా కర్బన ఉద్గారాలు లేని ఇంధనాన్ని తయారుచేసుకోవాలన్నది ఒక ప్రయత్నం. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో సాగు వ్యర్థాలు చాలా ఎక్కువ. వాటినుంచి మీథేన్ని వెలికితీసి అందులోని హైడ్రోజన్ని వాడుకోవడం రెండో ప్రయత్నం. ఈ రెండు విధానాలకూ సరిపోయే సాంకేతిక సన్నద్ధతతో ఐఓసీ హైడ్రోజన్ ఉత్పాదనకు సిద్ధంగా ఉంది. అంతేకాదు, మరొకడుగు ముందుకేసి సీఎన్జీలో 18శాతం హైడ్రోజన్ని కలపడం ద్వారా కూడా 70శాతం కాలుష్యాలను తగ్గించవచ్చని నిరూపించారు భారతీయ పరిశోధకులు. ఇప్పుడు దిల్లీలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది ఇలాంటి బస్సుల్నే. ఇవి విజయవంతమైతే పూర్తిగా హైడ్రోజన్ అందుబాటులోకి వచ్చేవరకూ ఇలాంటి వాటిని ఉపయోగిస్తారు. పదేళ్లలో ఇంత మార్పా? పదేళ్లలోనే ఈ రంగంలో పరిస్థితి చాలా మారింది. ఇప్పుడు బ్యాటరీ వాహనాలతో హైడ్రోజన్ వాహనాలు పోటీ పడుతున్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ కారు ఎక్కువలో ఎక్కువ వంద కిలోమీటర్లు వెళ్తుంది. అదే ఐదు కిలోల హైడ్రోజన్ సిలిండర్ ఉంటే 600 కి.మీ. నిరంతరాయంగా వెళ్లవచ్చు. అయిపోయినా రెండు నిమిషాల్లో నింపుకోవచ్చు, లేదా మరో సిలిండర్ మార్చుకోవచ్చు. పైగా హైడ్రోజన్ అపరిమితంగా దొరుకుతుంది. ఇవన్నీ చూశాక భవిష్యత్తులో విమానాలకు కూడా పనికొచ్చే ఇంధనం ఇదే అంటున్నారు ఎయిర్‌బస్ సీఈవో. ఒకప్పుడు పెట్రోలు కొత్తగా వచ్చి బొగ్గునీ స్టీమ్ ఇంజిన్లనీ ఎలా వెనక్కి నెట్టేసిందో అలా ఇప్పుడు హైడ్రోజన్ పెట్రోల్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంతో సమయం పట్టదనే అంటున్నారు నిపుణులు. అంతేకాదు, కరెంటుతో పనిచేసే పరికరాలన్నిటినీ హైడ్రోజన్తోనూ పనిచేయించవచ్చు. లైట్లూ ఫ్యాన్లూ ఏసీలతో సహా..! సైన్స్ ఫిక్షన్లా ఉంది, నిజమవుతుందా? సైన్స్ఫిక్షన్లలో రచయితలు రాసిన చాలా విషయాలను ఆ తర్వాత శాస్త్రవేత్తలు నిజం చేసి చూపించారు. దాదాపు 150 ఏళ్ల క్రితం ఫ్రెంచి రచయిత జూల్స్‌వెర్న్ కూడా ‘ద మిస్టీరియస్ ఐలాండ్’ అనే నవలలో ‘నీటిని ఇంధనంగా వాడే రోజు వస్తుంది. దాన్ని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులుగా విడదీసి అయినా, అలాగే కలిపి ఉంచి అయినా వెలుగుకీ వేడి పుట్టించడానికీ ముడిసరుకుగా వాడతారు అని రాశారు. ఆయన అది రాసిన సమయంలో శాస్త్రవేత్తలు హైడ్రోజన్, ఆక్సిజన్ అణువుల్ని కలపడం ద్వారా విద్యుత్తుని సృష్టించగలిగారు. ఆనాటి చిన్ని ప్రయోగం మరెన్నో ప్రయోగాలకు స్ఫూర్తినిచ్చి వాటి ఫలితం ఫ్యూయల్ సెల్ రూపం సంతరించుకునేసరికి 21వ శతాబ్దంలోకి వచ్చేశాం. ఇప్పుడిక, హైడ్రోజన్ని ఎక్కడికక్కడ తయారుచేసి, పెట్రోల్ బంకుల్లాగా ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయడమే మిగిలి ఉంది. అది కూడా జరిగి, అందరికీ ఇది అందుబాటులోకి వచ్చేస్తే గాలితో దూసుకుపోయే వాహనాలూ కాలుష్యం లేని చల్లని వాతావరణమూ మన సొంతమవుతాయి! అన్ని అవసరాలూ తీర్చగల ఈ ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ మన ఆరోగ్యానికే కాదు, భూమాత ఆరోగ్యానికీ భరోసానే! జపాన్ ‘హైడ్రోజన్ సొసైటీ’ హైడ్రోజన్ వాహనాల్ని ప్రోత్సహించడంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది జపాన్. కిక్కిరిసిన జనాలతో ఉన్న తమ నగరాల్లో చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ఉంటున్న ప్రజలకు పెద్ద పెద్ద కార్ల బ్యాటరీల నిర్వహణా ఛార్జింగూ సమస్య అవుతుందనుకుంటున్న ఆ దేశ ప్రభుత్వం హైడ్రోజన్ వాహనాలనే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. ఇప్పటికే చాలా వాహనాలను వాడుతున్న జపాన్ వచ్చే ఆరేళ్లలో రెండు లక్షల హైడ్రోజన్ వాహనాలను రోడ్లపై నడిపే ఆశయంతో పనిచేస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్ క్రీడల సందర్భంగా తమ హైడ్రోజన్ వాహనాలను సగర్వంగా ప్రపంచానికి చూపేందుకు సిద్ధమవుతోంది. క్రీడాకారుల్నీ, అతిథుల్నీ చేరవేయడానికి ప్రత్యేకంగా వంద హైడ్రోజన్ బస్సుల్ని సిద్ధం చేస్తోంది. ఇవి కాకుండా మరో నలభై వేల వాహనాలు ఇటు హైడ్రోజన్తోనూ అటు విద్యుత్తుతోనూ పనిచేసేవి తిరగనున్నాయి. బైక్ నుంచి ఎగిరే కార్ల వరకూ... వాహనాలను తయారుచేసే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఇప్పుడు హైడ్రోజన్‌తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టాయి. బైక్ నుంచీ ఫ్లైయింగ్ కార్ల వరకూ రైళ్ల నుంచీ విమానాల వరకూ అన్నిరకాల వాహనాలనూ ప్రత్యేకంగా తయారుచేస్తున్నారు. బ్రిటన్‌కి చెందిన ఈజీ జెట్ కంపెనీ తొలిసారిగా హైబ్రిడ్ విమానాలను తయారుచేస్తోంది. వీటిల్లో డీజిల్ ఇంజిన్‌తో పాటు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కూడా ఉంటాయి. విమానం పైకి లేచేముందూ కిందికి దిగినప్పుడు రన్‌వే మీద నడిచే సమయంలోనూ హైడ్రోజన్ని వాడుతోంది ఈజీ జెట్. ఆ చిన్న ఏర్పాటే అన్ని విమానాలకూ చేస్తే బోలెడు ఇంధనం ఖర్చూ ఉద్గారాల విడుదలా కూడా తగ్గుతాయని అంచనా వేసింది ఈ సంస్థ. దాదాపు పదేళ్ల క్రితమే బోయింగ్ కంపెనీ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించే వీలున్న చిన్న విమానాన్ని హైడ్రోజన్‌తో నడిపించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఫ్రాన్స్‌కి చెందిన మూడు కంపెనీలు కలిసి ‘ఆల్టర్బైక్’ అనే ఈ-బైక్‌ని హైడ్రోజన్‌తో పనిచేసేలా తయారుచేశాయి. ఫ్లైయింగ్ కార్లూ, డ్రైవర్‌లేని ఫ్లైయింగ్ కార్ల గురించే ఇప్పటివరకూ ఆసక్తిగా చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు మరో కొత్త ఫ్లైయింగ్ కారు తయారైంది. బీఎండబ్ల్యూ తయారుచేసిన ఈ హైడ్రోజన్ కారు ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 650కి.మీ. ప్రయాణిస్తుంది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. హ్యూగో స్పోవర్స్ ఒకప్పుడు కారు రేసుల్లో ఇష్టంగా పాల్గొనేవాడు. పర్యావరణానికి కార్లు చేస్తున్న హాని గురించి తెలిశాక రేసింగ్ మానేసి ఏకంగా కార్ల కంపెనీ పెట్టాడు. పదిహేనేళ్లపాటు ప్రయోగాలు చేసి రాసా అనే చిన్నకారును తయారుచేశాడు. ఎక్కడా రాజీపడకుండా తయారీలో కూడా పర్యావరణానికి ఇసుమంత హానిచేయని విధంగా అతడు రూపొందించిన ఈ కారు ఒకటిన్నర కిలోల హైడ్రోజన్‌తో 300 మైళ్లు నడుస్తుంది. నీరుంటే చాలు... ఇప్పటివరకూ మనం విద్యుచ్ఛక్తిని లీథియం అయాన్ బ్యాటరీలో నిల్వ చేసి ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుతున్నాం. సూత్రప్రకారం హైడ్రోజన్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలే. అయితే వీటికి కావలసిన విద్యుచ్ఛక్తి కరెంటుతో ఛార్జింగ్ చేయడం వల్ల కాక ఆక్సిజన్, హైడ్రోజన్ అణువుల మధ్య జరిగే రసాయన చర్య నుంచి విడుదలవుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లో జరిగే ఆ చర్య వల్ల హైడ్రోజన్ విడివడి విద్యుచ్ఛక్తిగా మారి మోటర్ని నడిపిస్తుంది. వేర్వేరు సామర్థ్యాల్లో ఫ్యూయల్ సెల్స్‌ని తయారుచేసుకోవడం ద్వారా రకరకాల ప్రయోజనాలకు హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుకోవచ్చు.  నీరూ కాస్త కరెంటూ ఉంటే చాలు హైడ్రోజన్ తయారుచేసుకోవచ్చు.  హైడ్రోజన్ సిలిండర్ నింపడానికి రెండు నిమిషాలు చాలు. బ్యాటరీల్లా గంటల తరబడి ఛార్జింగ్ సమస్య ఉండదు.  హైడ్రోజన్ వాహనాల సైలెన్సర్ నుంచి కేవలం నీటి ఆవిరి వెలుపలికి వస్తుంది. కాలుష్యం సున్నా.  బ్యాటరీలు రీసైకిల్ చేయడానికి పనికి రావు. హైడ్రోజన్ సెల్స్‌ని రీసైకిల్ చేయవచ్చు.  హైడ్రోజన్ సిలిండరూ ఫ్యూయల్ సెల్ రెండూ కలిసి కూడా వాహనంలో బ్యాటరీ కన్నా తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి, తక్కువ బరువుంటాయి. వీటితో పనిచేయడం వల్ల ఇంజిన్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.  హైడ్రోజన్‌తో నడిచే వాహనాల వల్ల శబ్దం తక్కువ. నిర్వహణ చాలా తేలిక.


Share to Twitter

 

 

Instead of petrol and diesel .... Air and water ... fuel!

 

Related