news logo

రాజకీయాలు

ఇస్రో దిగ్గజాల్లో ఆమె ఓకరు...ఆమే...

December 18, 2019 11:49am

ఆమె ఆలోచన ఆకాశమంత అందుకే అంతరిక్ష రంగంలో ఆమె ఓ సంచలనమైంది ఇస్రోకు ఆయువుపట్టైంది! ఆమే సుస్మిత మహంతి. పీఎస్ఎల్వీ-సీ48కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఇస్రో ప్రయోగించిన 50వ పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక. ఇది ఇస్రో వాణిజ్య విభాగమైన యాంత్రిక్స్‌కు భారీగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇప్పటి వరకు మొత్తం 319 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసీ కక్ష్యలోకి చేర్చింది. వీటిల్లో 233 ఉపగ్రహాలు ఒక్క అమెరికాకు చెందినవే.. ఇంత పెద్ద వినియోగదారుణ్ని భారత్‌కు అందించింది ఎవరో తెలుసా.. ఒక మహిళ. ఆమే సుస్మితా మహంతి. ఆమె కృషి ఫలితంగానే అమెరికాలోని స్టాన్ఫొర్డ్లోని స్కైబాక్స్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ నుంచి ప్రయోగించేందుకు ఆ దేశం అంగీకారం తెలిపింది. ఎవరీ సుస్మిత మహంతి..? సుస్మితా కటక్‌లో జన్మించింది. తండ్రి నీలమణి మహంతి. ఆయన ఇస్రోలో శాస్త్రవేత్త. ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. వీరి కుటుంబం ఆమె చిన్నప్పుడే అహ్మదాబాద్‌లో స్థిరపడింది. అది భారత అంతరిక్ష పరిశోధన రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ సొంత ఊరుకావడం.. తండ్రి ఖగోళ శాస్త్రవేత్త కావడంతో సుస్మిత ఆలోచనలన్నీ ఆకాశంలోనే ఉండేవి. స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడే ఆమె తన ఆలోచనను నాసాకు పంపించింది. ఆ తర్వాత కాలంలో అదే ఆలోచన అద్భుతమైన అంతరిక్ష స్టార్టప్‌గా మారడం విశేషం. సుస్మిత చిన్పప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నాక, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ నుంచి మాస్టర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత స్వీడన్‌లోని ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్లో డాక్టరేట్ పట్టా పొందింది. నాసా నుంచి మొదలై.. ఇస్రో వద్దకు.. విద్యాభ్యాసం తర్వాత నాసా, బోయింగ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలకి కొన్నాళ్లపాటు పనిచేశారు. పంతొమ్మిదేళ్ల క్రితం ఆమె తన స్టార్టప్‌ల ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ఏడాది శాన్ ఫ్రాన్సిస్కోలో ‘మూన్ ఫ్రంట్’ పేరుతో ఏరోస్పేస్ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించారు. 2003లో వియన్నాలో ‘లిక్విఫైర్ సిస్టమ్స్’ గ్రూప్‌కు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఈ సంస్థ ఏరోస్పేస్ ఆర్కిటెక్చర్, డిజైనింగ్ వంటి వ్యాపారాలు నిర్వహించేది. పదేళ్ల క్రితం ఆమె బెంగళూరు కేంద్రంగా ఎర్త్2ఆర్బిట్ (ఈ2వో) పేరుతో మరో స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ స్టార్టప్ ప్రపంచ దేశాలకు, ఇస్రోకు అనుసంధానంగా ఉండేది. ఈ2వో నుంచి ఇస్రోకు ఆర్డర్లు ఇచ్చిన దేశాల్లో జపాన్, అమెరికా కూడా ఉన్నాయి. ఇలా.. మూడు అంతరిక్ష అనుబంధ స్టార్టప్‌లు ప్రారంభించిన ఘనత సుస్మితకే దక్కుతుంది. భారత్‌లో తొలి స్పేస్ స్టార్టప్ కూడా ఈమెదే కావడం విశేషం. సుస్మిత మానస పుత్రిక ఈ2వో మొత్తం మూడు దశల్లో పనిచేస్తుంది. తొలిదశలో 2009-16 వరకు పీఎస్ఎల్వీకి కస్టమర్లను సమకూర్చింది. రెండో దశలో 2017-20 వరకు ఉపగ్రహాల సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పర్యావరణ మార్పులను అంచనా వేయడం, ముఖ్యంగా వ్యవసాయం, జల భద్రత వంటి అంశాలపై దృష్టిపెట్టింది. 2020 నుంచి మొదలయ్యే ఈ2వో మూడోదశలో యువత కోసం అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన స్ఫూర్తివంతమైన విషయాలని తయారు చేసి ప్రసారం చేయనుంది. సామాజిక బాధ్యతను గుర్తెరిగి.. సుస్మిత సొంతరాష్ట్రమైన ఒడిశాలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. సీఎం నవీన్ పట్నాయక్ కోరడంతో 2017-19 వరకు ఒడిశాలోని ‘మైస్కూల్’ కార్యక్రమానికి కేబినెట్ హోదాలో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేస్తోంది. ఈ కార్యక్రమం పరిధిలో 65వేల పాఠశాలలు, 72లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆమె హయాంలో ఈ కార్యక్రమం కింద ఏకంగా రూ.30కోట్లను సేకరించారు. ఇదో రికార్డు..! ‘ఏదో ఒక రోజు ఇస్రో ఛైర్మన్‌గా మహిళ’ భారత ఖగోళ పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని సుస్మిత మహంతి చెబుతున్నారు. ‘‘భారత్‌తో పోలిస్తే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటోంది. ఇస్రోలో కూడా అనురాధ టి.కె, డి.ఆర్.సుమ వంటి ప్రతిభావంతులైన నిపుణులు ఉన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌లో వాహకనౌక ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా లలితాంబికా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల చంద్రయాన్-2 సమయంలో ఆ ప్రాజెక్టులో కీలక డైరెక్టర్లుగా పనిచేసిన రీతూకరిధాల్, ముత్తయ్య వనితలు పేర్లు పెద్దగా బయటకు రాకపోవడం బాధగా అనిపించింది. అతి త్వరలోనే ఇస్రోకు ఒక మహిళ ఛైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. సుస్మిత ఘనతలు.. • 2012 ఫైనాన్షియల్ టైమ్స్ ‘25 ఇండియన్స్ టు వాచ్’ జాబితాలో పేరు. • 2019 బీబీసీ 100 ప్రభావవంతమైన మహిళల జాబితాలో స్థానం. • 2004 మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టిఆర్ 100 జాబితాలో స్థానం. • వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి చెందిన గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ఫర్ స్పేస్ టెక్నాలజీకి నామినేట్ అవ్వడం.


Share to Twitter

 

 

India's Space Woman Susmita Mohanty

 

Related