news logo

రాజకీయాలు

బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీలు

December 18, 2019 11:14am

బ్రిటన్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు మంగళవారం దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్లో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సభలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. భారత సంతతికి చెందిన సభ్యులు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు. తద్వారా బ్రిటన్ పార్లమెంటులో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను చాటారు. భారత్లోని ఆగ్రాలో జన్మించిన ఆలోక్ శర్మ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ప్రమాణం చేసే సమయంలో చేతిలో భగవద్గీతను పట్టుకున్నారు. సభ్యులు తమకు నచ్చిన పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసే వెసులుబాటు బ్రిటన్లో ఉంది. ఇష్టం లేనివారు ఆత్మసాక్షిగా ప్రమాణస్వీకారం చేయొచ్చు. ఈసారి ఎన్నికల్లో బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో 65 మంది శ్వేతజాతీయేతరులు విజయం సాధించారు. వీరిలో 15 మంది భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. ఈ సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. గత ప్రభుత్వంలో రిషి సునక్ ట్రెజరీ విభాగ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 39 ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్లో హాంప్షైర్ కౌంటీలో జన్మించారు. తాజా ఎన్నికల్లో యార్క్షైర్లోని రిచ్మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి. గతంలో థెరిసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే రోజుల్లో సహ విద్యార్థిని అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక రిషితో పాటు భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ఆగ్రాలో పుట్టి.. బ్రిటన్లో స్థిరపడ్డారు. 2010 నుంచి రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. థెరిసా మే ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గత జాన్సన్ కేబినెట్లో ఇంటర్నల్ డెవలప్మెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో, ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగనున్నారు. దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో ఉన్న మొత్తం 650 స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ 364 స్థానాలు కైవసం చేసుకుంది. మూడు దశాబ్దాల కాలంలో సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంత భారీ మెజార్టీ సాధించడం ఇదే తొలిసారి.


Share to Twitter

 

 

Indian-origin lawmakers take oath on Bhagavad Gita in UK’s House of Commons

 

Related