news logo

రాజకీయాలు

నన్ను ఆత్మహత్య చేసుకోమని బలవంతం చేస్తున్నారు: అధ్యాపకురాలి ఆవేదన

September 24, 2019 12:14pm

సహోద్యోగులు, సీనియర్లు తన పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతున్నారని ఓ మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆరోపించారు. అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ.. మానసిక వేదనకు గుర్తిచేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రకాలుగా తనను బెదిరిస్తున్నారని.. దాంతో తాను తీవ్రంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో ఉన్న క్వార్టర్‌లో తనను బంధించి తిండి కూడా తిననీయకుండా వేధిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేశారు. ‘గత 18 నెలలుగా తమిళనాడులోని ఠాగూర్‌ మెడికల్‌ కాలేజీ క్యాంపస్‌లోనే ఉంటున్నాను. సీనియర్లు, అడ్మినిస్ట్రేట్‌ సిబ్బంది నన్ను టార్చర్‌ చేస్తున్నారు. చెప్పలేని మాటలు అంటున్నారు. ఓ రోజు నేను క్లాస్‌లో అడుగుపెట్టగానే సీనియర్‌ ప్రొఫెసర్‌ నన్ను తోసివేశారు. దీంతో విద్యార్థుల ముందు జారిపడ్డాను. ఇది చాలా అమానుషం. గత కొన్ని రోజులుగా క్వార్టర్‌లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గదిలో బంధించి తాళం వేశారు. రెండు వారాల పాటు తిండి కూడా పెట్టలేదు. ఇక నిన్నటి నుంచి నీళ్లు కూడా ఇవ్వడం మానేశారు. నేను బాగా నీరసించిపోయాను. కుంగిపోతున్నా. ఆత్మహత్య చేసుకునేలా నన్ను ప్రేరేపిస్తున్నారు. ప్లీజ్‌ నన్ను కాపాడండి. నాకు న్యాయం చేయండి’ అని బాధితురాలు వీడియోలో అర్థించారు. అయితే తనను ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నారన్న విషయం గురించి మాత్రం ఆమె పేర్కొనలేదు. కాగా ఈ విషయంపై స్పందించిన ఠాగూర్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యం ఘటనపై విచారణకై కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. బాధితురాలు ఏడాదిన్నరగా తమ కాలేజీ క్వార్టర్‌లోనే ఉంటోందని.. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజీ డీన్‌ గుణశేఖరన్‌ మీడియాకు తెలిపారు.


Share to Twitter

 

 

Senior Torturing junior

 

Related