news logo

క్రీడలు

కోహ్లి కొడితే... మొహాలీ మనదే...

September 19, 2019 12:05pm

దక్షిణాఫ్రికాతో బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన టీ20ల్లో టీమిండియాకి ఇదే తొలి విజయం. అంతకుముందు 2015 భారత పర్యటన సందర్భంగా ఇరు జట్లు మూడు టీ20ల సిరీస్‌ ఆడగా అందులో రెండు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందడంతో స్వదేశంలో ఆ జట్టుపై ఇదే తొలి టీ20 విజయం. తొలుత టాస్‌ గెలిచిన కోహ్లీ సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో దక్షిణాఫ్రికాను 149 పరుగులకే పరిమితం చేశారు. నూతన కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌(52;37 బంతుల్లో 8x4), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ తెంబ బవుమ(49; 43 బంతుల్లో 3x4, 1x6) రాణించడంతో ఆ జట్టు మంచి స్కోర్‌ సాధించింది. అనంతరం లక్ష్యచేదనలో భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. కెప్టెన్‌ కోహ్లీ (72; 52 బంతుల్లో 4x4, 3x6), శిఖర్‌ధావన్‌(40; 31 బంతుల్లో  4x4, 1x6) రాణించడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. బలంగా అనుకుంటే దారి దొరుకుతుంది: కోహ్లీ జట్టుని గెలిపించాలని బలంగా అనుకుంటే దారి దొరుకుతుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికాపై స్వదేశంలో తొలి టీ20 గెలిచిన అనంతరం కెప్టెన్‌ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. బ్యాటింగ్‌లో తన నిలకడత్వంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా..‘నా జెర్సీపై ఉండే పేరు(ఇండియా) వల్లే ఇలా ఆడుతున్నా. దేశం కోసం ఆడటం గర్వకారణం. బరిలో దిగాక నేను చేయాల్సింది చేస్తా. ఎలాగైనా జట్టుని విజయతీరాలకు చేర్చడమే నా పని. నీ జట్టుని గెలిపించాలని అనుకుంటే నీకు దారి దొరుకుతుంది’ అని వివరించాడు. అలాగే తమ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్లే సఫారీల జట్టుని ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులకు కట్టడి చేయగలిగారని కోహ్లీ మెచ్చుకున్నాడు. ‘ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు ఎంతో కష్టపడ్డారు. పిచ్‌ బాగుండడంతో దక్షిణాఫ్రికా మంచి ఆరంభాన్ని సాధించింది. ఆపై బౌలర్లు అద్భుతంగా బంతులేసి మ్యాచ్‌పై పట్టు తీసుకొచ్చారు. కొత్త వారిని ప్రయత్నించడంతో పాటు ఒత్తిడిలో ఎవరు బాగా రాణిస్తారో వారి కోసమే మేం వెతుకుతున్నాం’ అని పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చిన ముగ్గురు కొత్త ఆటగాళ్లపై స్పందిస్తూ..ఒత్తిడిలోనూ వారు బాగా ఆడారన్నాడు. జార్న్‌ ఫార్చున్‌, ఆన్‌రిచ్‌ నార్జ్‌, తెంబా బవుమా రెండో టీ20లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బవుమా బ్యాటింగ్‌లో రాణించగా జర్న్‌, ఆన్‌రిచ్‌ కట్టుదిట్టమైన బంతులు వేశారు.


Share to Twitter

 

 

cricket

 

Related