news logo

క్రీడలు

ఆమె త్యాగం వృథా కాలేదు...తండ్రి మరణవార్త విన్నా.. దేశం కోసం

June 26, 2019 2:36pm

కన్నతండ్రి ఇక లేరని తెలిసినా గుండె దిటవు చేసుకుని దేశం కోసం ఆడిందీ క్రీడాకారిణి. నాన్న ఆఖరిచూపునకు కూడా వెళ్లకుండా తన జట్టు కోసం పోరాడింది. ఆమె త్యాగం వృథా కాలేదు.. దేశం గర్వించేలా ఆ జట్టు హాకీ సిరీస్‌లో విజయ దుందుభి మోగించింది. ఆమే 19ఏళ్ల భారత హాకీ క్రీడాకారిణి లాల్‌రెమ్సియామీ. మిజోరం రాష్ట్రానికి చెందిన లాల్‌రెమ్సియామీ గురించి నిన్నమొన్నటి వరకు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ తండ్రి మరణాన్ని దిగమింగుకుని దేశం కోసం ఆడిన వనితగా నేడు ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. లాల్‌రెమ్సియామీ భారత హాకీ మహిళల జట్టులో సభ్యురాలు. గత ఆదివారం ఈ జట్టు జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన హాకీ ఎఫ్‌ఐహెచ్‌ సిరిస్‌లో ఆతిథ్య జపాన్‌పై గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక.. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి 2020 ఒలింపిక్స్‌కు అర్హత కూడా సాధించింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ జరగడానికి రెండు రోజుల ముందు గత శుక్రవారం లాల్‌రెమ్సియామీ తండ్రి లాల్‌తన్సంగా జోత్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయం లాల్‌రెమ్సియామీకి తెలిసినప్పటికీ ఆమె స్వదేశానికి తిరిగి రాలేదు. ఫైనల్‌ మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని తండ్రిని ఆఖరిచూపు కూడా చూడలేదు. ‘నన్ను చూసి నా తండ్రి గర్వపడాలంటే నేను ఇక్కడే ఉండి టోర్నీలో ఆడాలి’ అని ఆమె కోచ్‌కు చెప్పారట. అలా గుండెల్లో బాధను దాచుకునే జట్టు కోసం ఆడారు. ఆమె త్యాగానికి గుర్తుగా ఫైనల్‌ విజయాన్ని లాల్‌రెమ్సియామీ తండ్రికి అంకితం చేశారు జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌. లాల్‌రెమ్సియామీ మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లిని హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు.


Share to Twitter

 

 

Fathers Funeral but she Play For Country

 

Related