news logo

క్రీడలు

బంతి కనిపించక పోవడంతో ఆగిన మ్యాచ్‌

April 25, 2019 1:18pm

తాజా ఐపీఎల్‌ సీజన్‌లో అంపైర్లు పదేపదే వార్తల్లో నిలుస్తున్నారు. నోబాల్‌ వివాదాలతో మొన్నటిదాకా విమర్శలు ఎదుర్కొని అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా మరోసారి హైలైట్‌ అయ్యారు. అయితే, ఈ సారి ఎవరి ఆగ్రహానికి గురికాలేదు. ఆటగాళ్లతో పాటు క్రికెట్‌ అభిమానుల నవ్వులకు కారణం అయ్యారు. అసలేం జరిగిందంటే.. మైదానంలో ఉన్న అంపైర్‌ మతిమరుపుతో మ్యాచ్‌ కాసేపు నిలిచిపోయింది. చిన్నస్వామి మైదానం వేదికగా బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శంషుద్దీన్‌, బ్రూస్‌ ఆక్సెన్‌ఫర్డ్‌ అంపైర్లుగా వ్యవహరించారు. తొలి ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్‌ వేసేందుకు పంజాబ్‌ బౌలర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ సిద్ధమయ్యాడు. బంతి కోసం కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను అడిగాడు. ఆటగాళ్లెవరి దగ్గరా బంతి లేకపోవడంతో అశ్విన్‌ అంపైర్‌ శంషుద్దీన్‌ను సంప్రదించాడు. బంతి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఇక లాభంలేదని భావించిన అంపైర్లు కొత్త బంతి తీసుకురావాలని కోరారు. సిబ్బంది బాల్‌ కిట్‌తో మైదానంలోకి ప్రవేశిస్తున్న సమయంలో థర్డ్‌ అంపైర్‌ బంతి కోసం పెద్ద స్క్రీన్‌లో రిప్లే వేశాడు. అయితే, ఆ వీడియోలో శంషుద్దీన్‌ జేబులోనే బంతి ఉన్నట్లు తేలింది. స్ట్రాటెజిక్‌ టైమ్‌ ఔట్‌ సమయంలో బంతిని తీసుకున్న అంపైర్‌ శంషుద్దీన్‌.. దాన్ని తన జేబులో వేసుకున్నాడు.కానీ, ఆ విషయం మరిచిపోయాడు. ఇదంతా రిప్లేలో చూసి ఆటగాళ్లతో పాటు మైదానంలో ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూశాయి. పొరపాటును తెలుసుకున్న ఆ అంపైర్‌ కొత్తబంతిని తీసుకొస్తున్న సిబ్బందిని వెనక్కి పంపించాడు. తన దగ్గర ఉన్న బంతిని బౌలర్‌కు ఇచ్చి బౌలింగ్‌ చేయించాడు. ఈ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.


Share to Twitter

 

 

cricket

 

Related