news logo

క్రీడలు

తండ్రి నాటిన అంకురం...బలహీనతని బలంగా మలుచుకున్న...విజయ్‌ శంకర్‌

April 17, 2019 11:57am

విజయం ముంగిట టీమిండియా బోల్తాపడుతున్న సందర్భం. ఒత్తిడి చిత్తు చేస్తోంది. గెలిపించేది ఎవరా అని అభిమానులు ఉత్కంఠతో చూస్తున్నారు. అలాంటి కీలక సమయంలో వరుసగా నాలుగు బంతులు వృథా చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లాడే టీ20లో 19 బంతులాడి 17 పరుగులతో పెవిలియన్‌ చేరాడు. అప్పుడు వినిపించిన మాట ‘వీడెక్కడ దొరికాడండీ బాబూ’! ఆ దెబ్బతో నాలుగు రోజులు నిద్రాహారాలు మానేసిన విజయ్‌ శంకర్‌ ఇప్పుడు ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికై ఆశ్చర్యపరిచాడు. ఇంటి పైకప్పుపై సాధన నుంచి ప్రపంచకప్‌నకు ఎంపికవ్వడానికి మధ్య ఏం జరిగింది? మేడపై పుట్టాడు తమిళనాడు రాజధాని చెన్నై శివారులోని మాడిపాక్కం విజయ్‌ శంకర్‌ స్వస్థలం. అక్కడ వారిదో మధ్యతరగతి మేడ. వీధిలోంచి చూస్తే మామూలు ఇల్లు. ఒకసారి డాబాపై ఎక్కి చూస్తే ఆశ్చర్యపోవడం అందరివంతు అవుతుంది. దాదాపు 86 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు గల నెట్స్‌ వేలాడుతుంటాయి. శక్తిమంతమైన విద్యుద్దీపాల వెలుగుల్లో ఆస్ట్రోటర్ప్‌ పిచ్‌పై ఓ బౌలింగ్‌ బంతులు విసురుతుంటే బ్యాటింగ్‌ సాధన చేస్తున్న విజయ్‌ శంకర్‌ కనిపిస్తాడు. సాధారణంగా ఏ శిక్షణ కేంద్రంలో చూసినా 13 అడుగుల ఎత్తులోపే నెట్స్‌ ఉంటాయి. కానీ అక్కడ భిన్నం. నెట్స్‌ పొడవు, వెడల్పును బట్టి విజయ్‌ శంకర్‌ కంటున్న కల ఎంత పెద్దదో అర్థంచేసుకోవచ్చు. తండ్రి చూపిన బాటలో.. దాదాపు పదేళ్ల వయసులో శంకర్‌ను అతడి తండ్రి క్రికెట్‌కు పరిచయం చేశాడు. తన ఇంటిపై ఓ క్రికెట్‌ అంకురాన్ని నాటాడు. స్థపతి శిల్పం చెక్కినట్టు అతడి తండ్రి ఈ ఆల్‌రౌండర్‌ను ఎంతో సహనంతో మలిచాడు. ఆఫ్ స్పిన్‌తో పాటు అద్భుత బ్యాటింగ్‌ చేసే క్లబ్‌ క్రికెటర్‌గా శంకర్ పేరు అనతికాలంలోనే చెన్నై అంతటా మోగింది. అప్పటికే ఎంతో మంది స్పిన్నర్‌ ఆల్‌రౌండర్లు ఉండటంతో అతడు తమిళనాడు జట్టుకు ఎంపికవ్వలేకపోయాడు. 15 ఏళ్ల వయసులో శంకర్‌ను మీడియం పేస్‌కు పరిచయం చేశాడు కోచ్‌ బాలాజీ. ఇప్పటికీ అతడే కోచ్‌. స్థానిక మ్యాచుల్లో 4-5 ఓవర్లు వేయించేవాడు. క్రమక్రమంగా ఓవర్లు పెంచాడు. అలా ఓ మీడియం పేసర్‌ ఆల్‌రౌండర్‌ రూపుదిద్దుకున్నాడు. ఇంటిపైన నెట్స్‌లో రోజూ 500 బంతులు సాధన చేస్తాడు. మలుపు తిప్పిన రంజీలు తన లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలోని మెట్లను విజయ్‌ శంకర్‌ త్వరగానే ఎక్కాడు. 2014-15 రంజీ సీజన్‌ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఏడు మ్యాచుల్లో 577 పరుగులు చేసి తమిళనాడు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. విదర్భపై క్వార్టర్‌ ఫైనల్లో 111, 82 పరుగులు చేసి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో తమిళనాడు సెమీస్‌ చేరింది. మహారాష్ట్రపై 91 పరుగులు చేసి బంతితో (2/47) సత్తా చాటాడు. మరోసారి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ వరించింది. ఫైనల్లో కర్ణాకటపై 5, 103తో రాణించినా జట్టుకు విజయం దక్కలేదు. రంజీల్లో అతడి ప్రదర్శనను మెచ్చిన సెలక్టర్లు భారత్‌-ఏకు ఎంపికచేశారు. అక్కడ్నుంచి 2018లో కోహ్లీసేన తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అయితే నిదహాస్‌ ట్రోఫీలో ఒత్తిడికి గురై 19 బంతుల్లో 17 పరుగులే చేసి విఫలమయ్యాడు. ద్రవిడ్‌ సాంత్వన నిదహాస్‌ ట్రోఫీలో పేలవ ప్రదర్శనపై నెటిజన్లు అతిగా స్పందించారు. దాంతో విజయ్‌ శంకర్‌ నాలుగు రోజులు నిద్రాహారాలు మానేశాడు. పడుకొనే ముందు ఎప్పుడు బెడ్‌లైట్‌ ఆర్పేసినా అదే గుర్తొచ్చేది. అతడి బాధకు సాంత్వన కలిగించాడు మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌. భారత్‌-ఏకు ఆడుతున్నప్పుడు ఒత్తిడినెలా జయించాలి, అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌లకు ఎలా సన్నద్ధం కావాలో నేర్పించాడు. అతడి బ్యాటింగ్‌ టెక్నిక్‌పై కన్నా మానసిక బలం పైనే ద్రవిడ్‌ ఎక్కువ దృష్టి కేంద్రీకరించాడు. అదే సమయంలో మహిళపై అనుచిత వ్యాఖ్యలతో హార్దిక్‌ పాండ్య జట్టుకు దూరమవ్వడంతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు విజయ్‌ శంకర్‌. పునరాగమనం అదుర్స్‌ పునరాగమనంలో సమయోచిత ప్రదర్శనతో ఔరా అనిపించాడు. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్టు ఆడాడు. అతడి ఆట, అభిరుచిని చూసి సారథి విరాట్‌ కోహ్లీ సంబరపడ్డాడు. న్యూజిలాండ్‌లో అతడి ఆటకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి! ‘నిదహాస్‌ ట్రోఫీలో ఆడింది ఈ విజయ్‌ శంకర్‌ కాదేమో’ అన్న మాటలు వినిపించాయి. నాగ్‌పుర్‌లో ఆసీస్‌తో రెండో వన్డేలో విరాట్‌తో కలిసి 71 బంతుల్లో 81 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అంతేనా 41 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. బౌలర్లపై దాడికి దిగిన శంకర్‌ను చూసి వ్యాఖ్యాతలు ఆశ్చర్యపోయారు. ఇక చివరి ఓవర్‌లో రెండు వికెట్లు తీయడాన్ని ఎవరూ మరిచిపోలేదు. నాలుగు, ఐదు, ఆరు.. ఆడింది ఏ స్థానమైనా పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేశాడు. ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున మూడో స్థానంలో ఆడుతూ అదరగొడుతున్నాడు. విజయ్‌ శంకర్‌ బలహీనతల్లా కీలక సమయాల్లో ఔటవ్వడం. ఈ విషయంలో మెరుగైతే అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో ఎవరికీ అనుమానాల్లేవు.


Share to Twitter

 

 

Vijay shankar

 

Related